Saatyaki s/o Seshendra |
యవ్వనంలో విజృంభించి వార్ధక్యంలో మరణించిందా? 1995లోప్రచురితమైన ఎంత కాలం ఈ ఎండమావులు ? పత్రికా రచనలు, సంకలనం నుంచి గుంటూరు శేషేంద్ర శర్మ Visionary Poet of the Millennium http://seshendrasharma.weebly.com/ ప్రపంచ మానవ చరిత్రలో 1917 అక్టోబర్ లో ఒక అపూర్వ ఐతిహాసిక సంఘటన ఒక మహత్తర మానవీయ వ్యవస్థకు జన్మ ఇచ్చింది. ఆ వ్యవస్థ గత నెల 6వ తేదీన గొడ్డళ్ళతో కొట్టిన మహావృక్షంలా కూలిపోయింది. గత నెల 6వ తేదీన ఇద్దరు ప్రధాన రష్యన్ నాయకులు మిఖాయిల్ గోర్బచేవ్, బోరిస్ ఎల్లిసన్ (ఒకరు సోవియెట్ యూనియన్ ప్రెసిడెంట్, మరొకరు రష్యన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్) సోవియెట్ యూనియన్లో కమ్యూనిజం విఫలమయింది లేక పరాజితమయిపోయింది” అని ఒక సంయుక్త ప్రకటన చేశారు. కమ్యూనిజానికి ప్రధాన ప్రతిద్వంది అయిన జార్జి బుష్ నాయకత్వం వహించే అమెరికా ప్రజల్ని ఉద్దేశించి, అమెరికా ప్రజల కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ టెలివిజన్లో ఈ ప్రకటన చేశారు. క్రెమ్లిన్ భవనంలో సెంట్ జార్జి హాల్లో గజదంత, సువర్ణాలతో ఖచితమైన సుశోభితమైన కుర్చీల్లో కూర్చుని ఆ ఇద్దరూ ఈ ప్రకటన చేస్తూ ఉంటే అమెరికా ప్రజలు వాళ్ళని చూస్తూ దాన్ని విన్నారు ఆనందించారు. వాళ్ళు ఈ ఇద్దర్నీ ప్రశ్నలు కూడా వేశారు. వాళ్ళకి వీరుభయులూ జవాబులు కూడా ఇచ్చారు. అలాంటి టెలివిజన్ విధానమిది. అన్ని జవాబులు అమెరికా ఎలా ఉంటే ఇష్టంగా ఉంటాయో అట్లాగే ఇచ్చారు. అయితే, సోవియెట్ యూనియన్ లో కమ్యూనిజం పరాజితం అయిందనే మాట వాళ్ళ ఇద్దరి అభిప్రాయం, అసత్యమో, లేక బలాత్కార ప్రదత్త కూట సాక్ష్యమో ఇప్పుడు మనం నిర్ధారణ చేసి చెప్పలేము. ఒక మహావృక్షం గొడ్డళ్ళ ధాటికి గురై కూలింది' అనే దృశ్యం మాత్రం చైతన్యం ఉన్న అన్ని నేత్రాలకూ కనిపిస్తుంది. గోర్బచేవ్, కుట్రనుంచి బయటపడ్డ తర్వాత ఆగస్టు 24వ తేదీన సత్వరంగా చేసిన పనుల్లో ఒకటి తను నిర్వహిస్తూ వచ్చిన సోవియెట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా ఇవ్వడం, రెండవది పార్టీ సెంట్రల్ కమిటీని స్వయంగా రద్దు చేసుకోమని 'డిక్రీ' ఇవ్వడం, మూడోది అఖిల సోవియెట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ఆస్తులన్నిటినీ జప్తు చేసి ఆయా స్థానిక సోవియెట్ల స్వాధీనంలో పెట్టడం, రహస్య పోలీసు శాఖ కె.జి.బీ లో, అంతరంగిక మంత్రిత్వ శాఖలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించడం. (సోవియెట్ అంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగ నిర్మాణంలో చివరి ఇటుక). దీనితో 'అర్జంటు’గా నిర్వర్తించవలసిన కీలక కార్యాలు పూర్తి చేశాడు. ఈ సంఘటన కోసం నక్కల్లా తోడేళ్ళులా నిరీక్షిస్తూ కూర్చొని ఉన్న ప్రముఖ కాపిటలిస్టు శక్తుల మానసిక ఒత్తిడికి కొంత విశ్రాంతి లభించింది. మరునాడే లండన్ నుంచి ప్రపంచ పత్రికల్లోకి ప్రవహించిన వార్తా వాహిని, అమెరికా బ్రిటన్ సోవియెట్ యూనియన్లో కమ్యూనిస్టు పార్టీ పరమపదించడం విని పరమానందభరితులయ్యారనీ, సోవియెట్ యూనియన్లో అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతున్నాయని జార్జి బుష్ అన్నాడనీ కమ్యూనిస్టు పార్టీ సోవియెట్ ప్రజలకు ఆశాభంగం కలిగించి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు మంచి ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపించుకోవడం శ్రేయస్కరమనీ బ్రిటీష్ ప్రధాని జాన్ మేజర్ అన్నాడని చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీన మిఖాయిల్ గోర్బచేవ్ ఫెడరేషన్ (1) అయిన ప్రస్తుత సోవియెట్ యూనియన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో స్వతంత్ర రిపబ్లిక్కుల కాన్ఫెడరేషన్ స్థాపించడానికి, ఈ మధ్యకాలంలో పరిపాలన నిర్వహణ కోసం ఒక తాత్కాలిక కార్య నిర్వాహక ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి, ఒక బిల్లును సోవియెట్ యూనియన్ సర్వోచ్ఛ అధికార సంస్థ అయిన “కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ డెప్యూటీస్' "సమావేశంలో ప్రవేశపెట్టాడు. దాన్ని ఆ సర్వోచ్ఛ సంస్థ ఆమోదించింది. అంతటితో దానికి ఇంకా ఉన్న మూడు సంవత్సరాల ఆయుస్సు కూడా అంతరించింది. సోవియెట్ టెలివిజన్ వెంటనే "పాత సోవియెట్ యూనియన్” మరణించింది. కొత్త యూనియన్ వర్ధిల్లాలి అని కేకలు వేసింది. ఈ వ్యాసం రాస్తున్న రోజు రష్యాలో 74 ఏళ్ళనుంచీ ఉన్న సోవియెట్ యూనియన్ లేదు. 74 ఏళ్ళనుంచి వున్న కమ్యూనిస్టు పార్టీ లేదు. కేవలం గోర్బచేవ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉంది. దాన్ని అంటుకుని లూజుగా 10 రిపబ్లిక్కులు ఉన్నాయి. బాల్టిక్ రిపబ్లిక్కులు ఇక దృశ్యంలోకి రావు. జార్జియా, మొల్లావియాల సంతకాలు లేవు. సోవియట్ యూనియన్ ఇలా ముక్కలు ముక్కలుగా చూడడం క్యాపిటల్ రాజ్యాల నేత అమెరికా కంటూ వచ్చిన సువర్ణ స్వప్నం ఈనాటికి నిజమయింది. గొప్ప ఘనకార్యమే చేశాడు గోర్బచేవ్ చివరకు! ఈవిధంగా అంత్యక్రియలన్నీ పూర్తి చేసి గోర్బచేవ్ ఎల్డ్సన్లు క్రైమ్లిన్నుంచి అమెరికా ప్రజలకు సోవియెట్ యూనియన్లో కమ్యూనిజం చచ్చిపోయిందని ప్రకటన చేశారు. ఇంతగా అమెరికన్లకి తమ భక్తి శ్రద్దల్ని రుజువు చేసుకోవలసిన అక్కర వారికెందుకు కలిగిందో ఊహాతీతం. అలా బ్రిటిష్ ప్రజలకు గానీ జర్మనీ ప్రజలకుగానీ, ఇండియన్ ప్రజలకుగానీ, ఏ ఇతర ప్రజలకుగానీ వారు విజ్ఞప్తి చేసుకోలేదు. ఇక్కడ గుర్తించవలసిన కొన్ని సూక్ష్మలున్నాయి. అమెరికా మాజీ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అమెరికా కుతంత్ర రాజకీయానుసారంగా సోవియెట్ పర్యటన చేసి వచ్చాడు. అక్కడ క్యాపిటలిస్టు మిత్ర నాయకులైన ఎల్టీసి లాంటి వారిని కలిసి సన్నిహిత చర్చలు జరిపారు. ఇంకా ఆసక్తికరం, సోవియెట్ యూనియన్ రద్దు చేయబడిన రోజే అమెరికా సెక్రటరీ జేమ్స్ బెకర్ దొరగారు బుష్షుగారి సందేశం మోసుకుంటూ వచ్చి మాస్కోలో దిగారు. ఇది 5 పాయింట్ల సూత్రం. దాని గురించి బహిరంగంగా చెప్పడం మాత్రం, “అణ్వస్త్రాల కోసం ఒక కేంద్రీకృత నిర్దేశకత్వం ఉండాలి. అన్ని పార్టీలు కలిసి సంస్థ లన్నిటినీ ప్రజాస్వామ్య అనుగుణంగా మార్చాలి” అని. కానీ జేమ్స్ బెకర్ గోర్బచేవ్, ఎల్డ్సిన్లకు అంతరంగికంగా ఏ ఆజ్ఞ యిచ్చి వెళ్ళాడో కాలమే చూపించాలి. కానీ ఇది ఎంత ఘోరమైన సంఘటన - అమెరికా అనే పరాయి దేశం సోవియెట్ యూనియన్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అజ్ఞాపించడం. గత జూలైలో గోర్బచేవ్ సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ఇన్నాళ్ళు తన పునాదిగా ఉన్న మార్క్సిజం-లెనినిజం' సిద్ధాంతాన్ని పరిత్యజించాలని ప్రతిపాదించాడు. పార్టీ పేరు కూడా మార్చి సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అనే పేరు పెట్టుకోవాలని కూడా చెప్పాడు. పార్టీ సెంట్రల్ కమిటీ ఈ ప్రతిపాదనల్ని అంగీకరించింది. ఆ కమిటీ ఎలాంటి అద్భుత వ్యక్తి సముదాయమో చూడండి! 1985 మార్చి 11వ తేదీన పార్టీ జనరల్ సెక్రటరీగా గోర్బచేవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెర్నెంకో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నికొలాయ్ టిఖనోవ్. ఆనాడు అమెరికా ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ వైన్ ప్రెసిడెంట్ జార్జిబుష్, బ్రిటన్లో ప్రధానమంత్రి మార్గరేట్ థాచర్. ఈ అంతర్జాతీయ రాజకీయ చిత్రంలోకి పదార్పణ చేసిన గోర్బచేవ్ లెనిన్, స్టాలిన్లు వహించిన కీలక స్థానంలోకి వచ్చాడు. వెంటనే 1985 నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ జెనీవాలో కలిసి దీర్ఘకాలంగా ఉభయ రాజ్యాల మధ్య ఉన్న వైమనస్యాన్ని తొలగించాడు. ఇది గోర్బచేవ్ పూనుకొని చేసిన చర్యా లేక అమెరికా ప్రయత్నించి సంభవింపచేసిన సంఘటనో, వాస్తవం కూటనీతి పరదాల వెనకే ఉండిపోయింది. ఇది జరిగిన కొలది మాసాలకే గోర్బచేవ్ పెరిస్త్రోయికా, గ్లాస్ నోస్త్ (పునర్నిర్మాణము, బహిరంగత) అనే రెండు అస్త్రాలు సోవియెట్ సమాజ పునరుజ్జీవనం కోసం జెనీవా కొండల్లో నుంచి తీసుకొచ్చాడు. 'లెనిన్, స్టాలిన్ల లాంటి శకపురుషులు తమ జీవితాల్ని అంకితం చేసి అసంఖ్యాక ప్రజానీక రక్తపాతం ఫలితంగా సుమారు నాలుగు దశాబ్దాల కృషితో ఒక అపూర్వ సమాజాన్ని మానవ జాతి చరిత్రలో తత్పూర్వం లేని ఒక స్వప్నంలాంటి వాస్తవాన్ని నిర్మించగా దాన్ని మరమ్మతు చేసి మంచి సమాజాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఇస్తానని 1986లో గోర్బచేవ్ బయలుదేరాడు. 1987లో “మధ్యమ దూర అణ్వస్త్ర” సైన్యాల్ని తొలగించే సంధి అమెరికాతో చేసుకున్నాడు. ఉభయ పార్టీలు ఇచ్చిన స్టేట్మెంట్లు విన్నామేగానీ అమెరికా వాస్తవంగా ఏం చేసిందో లోకానికి తెలీదు. 1991 సెప్టెంబర్ 28వ తేదీన జార్జి బుష్ ఏకపక్షంగా, తమ అణ్వస్త్రాల్లో ఒక పెద్ద భాగం విధ్వంసం చేస్తున్నాననీ, ఆ విధంగానే దానికి సమానంగా సోవియెట్ యూనియన్ కూడా చెయ్యాలని ప్రకటించాడు. తర్వాత వచ్చిన వార్తల్నిబట్టి ఆ ప్రకటన అజాగళస్తనంలా నిరర్ధకమనీ ఆయన ఆ పని చేసిన తర్వాత కూడా ఇరాన్ ను విధ్వంసం చేసిన 'డెజర్ట్ స్టార్మ్' లాంటి యుద్ధ చర్యకు కావలసినన్ని అణ్వస్త్రాల కంటే అధికంగానే ఉన్నాయని తేలింది. అంటే జార్జిబుష్ ఇలాంటి కుయుక్తుల్లో ప్రవీణుడని మరొకసారి స్పష్టమయింది. 1985లోని కమ్యూనిస్టు చైనా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని పరిత్యజించి, తన కమ్యూనిస్టు సమాజంలో మార్పులు తెచ్చింది. 101 సంవత్సరాల క్రితం జీవించిన కార్ల్ మార్పు భావాలు ఆధునిక సమాజ నిర్మాణానికి పనికి రావని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార వార్తా పత్రిక “పీపుల్స్ డైలీ” ఒక అసాధారణ మొదటి పేజీ సంపాదకీయంలో ప్రకటించింది. అంతమాత్రంచేత చైనా ఈనాడు కమ్యూనిస్టు దేశం కాకపోలేదు. అట్లాగే ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ కూడా 1976లో ప్రాలెటేరియట్ డిక్టేటర్షిప్ను తొలగించి తాము అవలంభిస్తున్న మార్క్సిస్టు సిద్ధాంతంలో మార్పు తెచ్చింది. మెయిన్ స్ప్రింగ్ పీకేశారు 1988లో సుప్రీం సోవియెట్ కూ, కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ డిప్యూటీ ముఖ్యమైన మార్పులతో ఎన్నికలు జరిపించిన గోర్బచేవ్, ఇంతవరకూ ఏక రాజకీయ పక్షం ఉండగా ఈసారి బహుళపక్ష రాజకీయాలు ప్రవేశపెట్టాడు. మార్క్సిజానికి పునాదిరాయి అయిన “ప్రాలెటేరియట్ డిక్టేటర్ ప్రధాన సూత్రం దీనితో రద్దయిపోయింది. అంటే కమ్యూనిజంలో ఉన్న మెయిన్ స్ప్రింగ్ ను పీకేశాడు. 1989 ఆగస్టు 20 ఆటోసమస్ రిపబ్లిక్కులకు అదేవిధంగా అనేక ఆటో నమస్ రీజియన్లకు అధిక అటానమీ ఇస్తూ ఒక బిల్లు, సోవియెట్ వర్కర్లకు సమ్మె చేసే హక్కు ఇస్తూ మరో బిల్లు తయారు చేసి, తదనంతరం వాటిని ఆమోదింపజేయించాడు. ఈ సంవత్సరంలోనే సోవియెట్ ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రొ. నికొలాయ్ వోరోంట్సోవ్ అనే కమ్యూనిస్టేతర వ్యక్తి అయిన ఒక వృక్ష శాస్త్రజ్ఞుని మంత్రిగా చేర్చాడు. ఈ చర్యను సుప్రీం సోవియట్ ఆమోదించింది. 1989 నిజంగా కమ్యూనిస్టు ప్రపంచానికి చారిత్రాత్మకమైన సంవత్సరం, కారణం, కమ్యూనిజాన్ని కూకటి వేళ్ళతో సహా పీకిపారెయ్యడానికి కావలసిన చర్యలన్నీ ఏకపక్షంగా ఈ సంవత్సరంలోనే తీసుకోబడ్డాయి. ఈ సంవత్సరమే గోర్బచేవ్ హంగరీ, రుమేనియా, బల్గేరియా, చెకోస్లొవేకియా వగైరా తూర్పు ఐరోపా కమ్యూనిస్టు రాజ్యాల్లో వాటికి అండగా వున్న సోవియెట్ సైన్యాల్ని తొలగించి ఆ దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు రాజకీయాలు కూలిపోయేలా చేశాడు. ఆ దేశాల కమ్యూనిస్టు రాజ్యాల్లో ఘోరమైన తప్పులు ఉన్నట్లు విదితమయింది. కానీ అవి ఇన్నాళ్ళూ సోవియెట్ యూనియన్ పశ్చిమ సరిహద్దు కాపిటలిస్ట్ రాజ్యాల్నించి రక్షించే బలీయమైన కోటగోడగా నిలిచి ఉన్నాయి. వాటిలో తప్పులుంటే కమ్యూనిస్టు కూటమిలోనే వాటిని సరిదిద్దవలసింది. దానికి బదులు ఆత్మహత్యాసదృశ్యం విధ్వంసం. తూర్పు ఐరోపా కమ్యూనిస్టు రాజ్యాల మొత్తం విధ్వంసం తీసుకొచ్చాడు. కాపిటలిస్టు రాజ్యాల యుద్ధ కూటమి అయిన ‘నాటో అలా ఉండగానే వార్సా సంధి రాజ్య కూటమిని రద్దు చేశాడు. ఆ తూర్పు ఐరోపా కమ్యూనిస్టు రాజ్యాల్లో కూడా కమ్యూనిజాన్ని త్రోసివేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాయేగానీ తర్వాత ఆర్థిక పరంగా కానీ, దానిమీద ఆధారపడి ఉన్న స్వాతంత్య్రం పరంగా గానీ ఏ విధమైన సఫలతా సాధిచలేకపోయాయనీ, స్వాతంత్ర్యం వచ్చిందేగానీ రాజకీయంగా అసమర్ధత, అనిశ్చితి అధికమైపోయి ప్రగతి నిరోధక శక్తులు సర్వత్రా వ్యాపించాయని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. మధ్య ఒక పత్రికలో వచ్చిన “ఈస్ట్ యూరోప్: ఫియ్యర్ ఆఫ్ ఫ్రీడం” అనే వ్యాసంలో వ్యాసకర్త టోనీ బార్బర్ ఈ విధమైన విశ్లేషణే ఇచ్చాడు. సోవియెట్ కమ్యూనిజాన్ని విధ్వంసం చేయడంలో శరవేగంతో దూసుకుపోతున్న గోర్బచేవ్ లో “సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సోవియెట్ యూనియన్ పరిపాలనా నీతిని నడుపుతుందనే 6వ నిబంధనను సోవియెట్ రాజ్యాంగం చట్టం నుంచి తొలగింపజేశాడు. దీనితో బహుళపక్ష రాజకీయాల ద్వారా అంతరించిన ప్రాలిటేరియట్ డిక్టేటర్షిప్ తిరిగివచ్చే అవకాశం లేకుండా సిమెంటు గోరీ కొట్టేశాడు. అదే ఊపులో పారిశ్రామిక వర్గ నేతృత్వం, మార్కెటు విధానపు ఆర్థిక వ్యవస్థ ప్రవేశపెట్టిన ఈ మార్కెటు విధానం మార్పుతో సోవియెట్ ప్రజలు నేడు దైనిక జీవనంలో వర్ణనాతీతంగా బాధలకు గురి అవుతున్నారు. క్యాపిటలిజం - సోషలిజం" అనే వ్యాసంలో వ్యాసకర్త ఎరిక్ హాబ్స్ బాం ఇలా రాశాడు”, 1917 తర్వాత పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన కమ్యూనిస్టేతర దేశాలు పెద్ద విజయాలేమీ సాధించలేదు.... అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో సైతం థాచరిజం స్వేచ్చా మార్కెట్టు వ్యవస్థ విజయం పొందలేదు.” (కమ్యూనిజం నవంబరు, పే. 17) ఈ రోగాన్ని మొన్నటి కొత్త బడ్జెట్ ద్వారా అంటించుకున్న మన భారతదేశానికి ఏగతి పట్టింది - ఈ సంవత్సరంలోనే ప్రయివేటీకరణ, సొంత ఆస్తి ఇత్యాది ఆయుధాల ద్వారా కమ్యూనిజం ఊపిరితిత్తుల్ని శ్రీ గోర్బచేవ్ పీకిపారేశాడు. ఒక్క దేశంగా ఉన్న సోవియెట్ యూనియన్ ను ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని వందల స్వతంత్ర రాజ్యాలుగా మార్చే ఒక 'న్యూ యూనియన్' సంధి సూత్రం తయారు చేసి వివిధ రిపబ్లిక్కులతో కలిసి గత ఆగస్టు 20వ తేదీన సంతకాలు చేయడానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. 19వ తేదీనే కుట్రలో ఇరుక్కున్నాడు. కుట్రదారులు అసమర్థులు అయితే కుట్రదారులు అసమర్థులనేది విశదమే. ఎల్డ్సిన్ లాంటి అగ్రశ్రేణి క్యాపిటలిస్టు మిత్రులకు కుట్ర సమయంలో బయటి ప్రపంచంతో సంపర్కం ఉండనిచ్చారు. కుట్రకు కావలసిన ఏ జాగ్రతలు తీసుకోలేదు. కుట్రదారులు పంపిన సైన్యమూ, కే.జీ.బీ. వారూ, తిరుగుబాటు చేస్తున్న జనం మీదగానీ ఎల్డ్సన్ మీదగానీ గట్టి చర్య తీసుకోలేదు. కుట్రదారుల మీద వాళ్ళకు విశ్వాసం లేకపోవడము అసమర్థులతో అవిశ్వసనీయ వ్యక్తులతో కమ్యూనిస్టు పార్టీ నిండి ఉండడం ఇందుకు కారణం కావచ్చు. చివరకు 'వర్తమాన వాస్తవానికి కుట్ర నాయకుడైన గెన్నడీ యానయేవ్, ఎన్, పెవర్డ్ నార్డే వర్ణిం ప్రముఖుల్ని సృష్టించినవాడు గోర్బచేవ్. సోవియెట్ యూనియన్ని ఈ పతనావస్థలో చూడడానికి కృషి చేస్తూ కలలు కంటున్న క్యాపిటలిస్టు రాజ్యాలు కూడా ముఖ్యంగా అమెరికా, ఇప్పటికే ప్రజల్లోనూ ఎల్డ్సిన్ లాంటి నాయకుల్లోనూ పాశ్చాత్య ప్రభావం వ్యాపింపచేసి నేలదున్ని చదును చేసి పెట్టారు. మహామేధావి, పెట్రోగ్రాడ్ సోవియెట్ నిర్మాత, ఎర్రసైన్యం స్రష్ట అయిన లియాన్ ట్రాటిస్కీ జ్యోతిష్యం నిజమైనట్లు భావించవచ్చా? కమ్యూనిజం ముందు ప్రపంచ వ్యాప్తంగా స్థాపించిన తర్వాతే ఏ ఒక్క దేశంలోనైనా అది నిలుస్తుంది. లేకపోతే చుట్టూ ఉన్న క్యాపిటలిస్టు దేశాలు ఆ ఏకైక కమ్యూనిస్టు దేశాన్ని చుట్టుముట్టి నాశనం చేస్తాయి అని ట్రాట్ స్కీ వాదం. కానీ కమ్యూనిజం ముందు ఒక దేశంలో స్థాపింపబడాలి, దాని విజయాలు ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గంలో అశాంతి రెచ్చగొట్టి ప్రపంచమంతా విప్లవాలు వచ్చి అన్ని దేశాల్లో కమ్యూనిజం వస్తుంది అని జోసెఫ్ స్టాలిన్ సిద్ధాంతం. మొదట స్టాలిన్ సిద్ధాంతమే నిజమయింది. మనిషికి ఆయు:పరిమితి ఉన్నట్లే, మనిషి ఉద్యమానికి కూడా ఉంది. మనిషిలాగే సోవియట్ కమ్యూనిజం యౌవనంలో విజయాలు సాధించి, వార్ధక్యంలో వ్యాధులకు గురై ఆయుస్సు తీరేసరికి మరణించింది. అన్ని ఉద్యమాలు ఇలాగే అంతమయ్యాయి. ఇలాసరిపెట్టుకోవచ్చా? చెట్టు కూలిపోయినా... ఒక మహావృక్షం కూల్చి వేయబడినప్పటికీ అది మరణించడానికి చాలా కాలం పడుతుంది. అది అసలు చావదు కూడా! అంపశయ్య మీద భీష్ముడిలా అలాగే ఉంటుంది నిరీక్షిస్తూ.. చినుకులు పడగానే దాని మహా శరీరం నుంచి చిగురాకులు తొడుక్కుని చిన్న చిన్న కొమ్మలు బయటికొస్తాయి. పెద్ద చెట్లవుతాయి. పూలు పూస్తాయి. ఫలిస్తాయి.. గొడ్డలి తగిలిన చెట్టు మొదలు నుంచి అనేక వేర్లు మొలిచి నేలలోకి దిగుతాయి. ఒక మహావృక్ష పతనానంతరం అనేక మహావృక్షాలు నిల్చుంటాయి. లెనిన్ శిలా విగ్రహాల్ని సోవియెట్ నగరాల్లో క్యాపిటలిస్టు దేశాలు ప్రేరణతో కిరాయి మూకలు కూల్చివేస్తుంటే గాయపడిన హృదయాలతో విషాదగ్రస్తులైన అసంఖ్యాక ప్రజల్ని, వక్రీకృత ప్రచార సాధనం మనకు చూపించలేదు. కానీ ఈ ఇనప చదరంగం నుంచి వారి అశ్రు వులు వారి ఆర్తి, బొట్లుగా కారి మన దాకా రాకపోలేదు. మాస్కో నుంచి ప్రజా శత్రువుల్ని దాటుకుని మనల్ని చేరిన వార్తల్లో ఒకటి - ఆనటోలీ, అతని పత్ని వాలెంటీనా కిపా (అరవై ఏళ్ళ వయస్సు దంపతులు) 1900 కిలో ప్రయాణం చేసి పాగ్రడ్నీ అనే ఊరు నుంచి మాస్కో వచ్చారు. మొసోలియం దర్శనం చేసుకోవడానికే (అంటే ఈ గొడవల్లోనే!) గ్లాసు పెట్టెలో ఉన్న మహాపురుషుడు లెనినన్ను దర్శనం చేసుకొని వస్తూ వాలెంటినా అన్నదట “ఆయన మన మహానాయకుడు, మన ఉపాధ్యాయుడు, మన మిత్రుడు, మన కామ్రేడ్. ఆయన కృషి మూలంగా మనకు అక్టోబర్ రివల్యూషన్ వచ్చింది. రైతులకు పొలాలు, కూలీలకు ఫ్యాక్టరీలు లభించాయి” సైబీరియా నుంచి లెనిన్ మూర్తి దర్శనం కోసం వచ్చిన ఉలాన్ ఊదే అన్నాడు. “ఆయన మనకు సహాయం చేశాడు. ఆయన రంగంలోకి రాకముందు, ధనికులకే విద్యా, ఉద్యోగాలు లభించేవి. ఆయన వచ్చిన తర్వాత మన అందరికీ అవి లభిస్తున్నాయి.” సంస్కరణవాది అయిన మాస్కో మేయర్ నికొలాయ్ యికాష్ యిలా అన్నాడు “కళాత్మకమైన మన చారిత్రక శిల్పాల్ని ఇలా ధ్వంసం చేయడాన్ని నేను క్షమించలేను. లెనిన్ శిల్పాన్ని తొలగించడాన్ని నేను పూర్తిగా నిరోధిస్తాను. “ఆఫ్గనిస్తానికి ఉత్తరాన సోవియెట్ యూనియన్ దక్షిణ సరిహద్దుగా ఉన్న తజికిస్తాన్ రిపబ్లిక్లో ఆ రిపబ్లిక్ సంస్కరణవాది ప్రెసిడెంట్ కద్రేద్దీన్ ఆన్లైన్లోవ్ కమ్యూనిస్టు పార్టీని రద్దు చేస్తూ 1991 సెప్టెంబర్ 23న ఒక డిక్రీ జారీచేశాడు. కమ్యూనిస్టు పార్టీ ఆస్తిని జప్తు చేయించాడు. దీనితోపాటు వెంటనే కొన్ని మూకలు లెనిన్ విగ్రహాల్ని కూల్చివేయడం ప్రారంభిం చాయి. కానీ శాసనసభ అర్జంటుగా సమావేశమై ప్రెసిడెంటు చేత రాజీనామా చేయించింది, రక్షణ సైన్యాల్ని లెనిన్ శిలా విగ్రహాల్ని తొలగించనీకుండా కట్టుబాటు చేసింది. ప్రెసిడెంటు డిక్రీ, మూకలు లెనిన్ విగ్రహాల్ని కూల్చివేయడం ఒక జాయింట్ కుట్ర అని ఈ వార్త మూలంగా అర్థ మవుతూనే వుంది. సోవియెట్ యూనియన్ లో ఉన్న రిపబ్లిక్ లో జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలు కూడా క్యాపిటలిస్టు దేశాల ప్రేరణ భక్తులు కల్పించినవే అని మనం ఊహించవచ్చు. ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా అందరు మానవులూ సమానం అని చెప్పడం నేరంగా భావించే రోజుల్లో, తమ శ్రమ తప్ప వేరే ఆస్తి లేని వాళ్ళు నూటికి తొంభైమంది సమాజంలో ఉన్న రోజుల్లో, వాళ్ళు తిండిలేక మాడుతూ ధనిక వర్గాలకు బానిసలుగా ఉన్న రోజుల్లో, వాళ్ళతో ధనికులు సమానమవడం ఆనాటి ఉన్నత వర్గాలవారు ఎన్నడూ కనీవినీ ఎ- రగని మాట. ఆ మాటను నిజం చెయ్యడానికి వేదాంతం సహాయం చెయ్యదు. రక్తపాతం అనే బలి కోరుతుంది ఆ మాట. ఆ బలి ఇచ్చి నిర్మించిన సమాజమూ అడవిలా గజబిజిగా పెరిగిన బలవంతుల బలహీనుల మిశ్రమమైన సమాజమూ ఎంత భిన్నంగా ఉంటాయో ఎన్ని ఉపాయాలతో ఎన్ని కోరిన చర్యలతో ఎంత అకుంఠిత దీక్షతో ఆ నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందో మొదట మనం ఊహించాలి. అలాంటి సమాజం చుట్టూ చేరి దాన్ని విధ్వంసం చేయాలని కటిబద్దులై ఉన్న క్యాపిటలిస్టు శక్తుల్నించి దాన్ని రక్షించడానికి ఏం చెయ్యాలి? ఆ నూతన సమాజ మూలకర్తలు ఇదంతా ఆలోచించే మానవ చరిత్రలో ప్రథమ కమ్యూనిస్టు దేశమైన సోవియెట్ యూనియన్ని రక్షించి పెంచడానికి, పోషించడానికి దాని కాళ్ళు దృఢమై అది భూగోళం మీద బలిష్ట శక్తిగా నిలబడడానికి తీసుకున్న అనివార్య చర్యల్లో ఐరన్ కర్టన్' ఒకటి. ఇది తప్పుగాదని నిష్కర్షగా చెప్పవచ్చు. ఇంచు మించు ఇలాంటి పరిస్థితుల్లోనే, నూతనంగా జన్మించిన తమ దేశాన్ని దృఢతరం చేసుకోడానికి 1823లో అమెరికా ప్రెసిడెంట్ మన్రో యూరపియన్ దేశాలు ‘అమెరికా’ ఖండంలో ఏ విధమైన జోక్యం చేసుకున్నా ఆ దేశాలలో అమెరికాకు యుద్ధం ప్రారంభమైనట్లే అని ఒక విస్పష్ట ప్రకటన చేశాడు. ఆ విధంగా సుమారు ఇరవై ఏళ్ళు తలుపు బంధించుకొని వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో మహత్తర ఉత్పత్తి సాధించి, ఉత్పత్తులు పొర్లిపోవడం, దేశంలో వాటి ధరలు పడిపోవడం ప్రారంభించిన తరువాత మెల్లగా తలుపులు తెరిచి అమెరికా చైనాతో ఒక వ్యాపార ఒడంబడిక చేసుకుంది. 1840లో చైనా ఐక్యతకు భంగం రాకూడదని అన్య దేశాలకు నైతిక ఉపదేశాలు చేస్తూ చైనాలో చొచ్చుకొని. 1895లో ఫిలిప్పైన్స్ను హస్తగతం చేసుకుంది. అలస్కాను కొన్నది. పసిఫిక్ లో ఉన్న మిడ్వే ఐలెండును ఆక్రమించుకుంది. అమెరికా కబళనక్రియా పారీణతకు ఇలాంటి ఉదాహరణలు ఇవ్వాలంటే ఆ లిస్టుకు అంతం ఉండదు. కానీ ప్రస్తుత విషయం ఏమిటంటే, గద్దలు తన్నుకు రాకుండా కోడి పెట్ట తన పిల్లల్ని రెక్కల్లో దాచి పెంచుతూ వచ్చినట్లు, లెనిన్ స్టాలిన్లు ఈ అపూర్వ కమ్యూనిస్టు సమాజ శిశువును అనేక బహిరంగ శత్రువుల నుంచి అనేక రక్షణలు కల్పించి పోషించి పెంచగా ఆ తర్వాత వచ్చినవారు కూడా అదే శ్రద్ధ తీసుకోగా, ఇప్పుడు వచ్చిన ఈ గోర్బచేవ్ ఐరన్ కర్టన్ ని ఏకంగా చింపివేసి ఎందుకు కమ్యూనిస్టు సమాజాన్ని కుక్కలకు నక్కలకు తోడేళ్ళకు అప్పగించవలసి వచ్చిందని ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం గానీ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో గానీ తప్పులు జరిగి ఉంటే అవి దిద్దుకోవచ్చునుగదా? స్టాలిన్ అంతటి వాడినే కృశ్చేవ్ స్టాలిన్ వ్యక్తి పూజ కల్పించాడనీ నియంతగా వ్యవహరించాడనీ ఇంకా అనేక విధాలుగా అతి తీవ్రంగా ఖండించి ప్రభుత్వంలో పార్టీలో కొన్ని మార్పులు చేశాడు. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో అమెరికాని మించిపోవాలనే అంచనా సోవియెట్ ప్రజల ముందు పెట్టాడు. కన్స్యూమర్ గూడ్స్, ఆహారము అనే రెంటి మీద కేంద్రీకరించి సోవియెట్ ప్రజల జీవన స్థాయిని స్టాలిన్ రోజులకంటే హెచ్చుగా పెంచాడు. పాశ్చాత్య దేశాలకూ సోవియెట్ యూనియన్ మధ్య “శాంతియుత సహజీవనం” అనే విధానం ప్రవేశపెట్టాడు. ఆయన తర్వాత వచ్చిన బ్రెజ్నేవ్, కోసిజిన్లు కూడా అలాంటి మార్పులు కూర్పులు చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. క్యాపిటలిస్టు, కమ్యూనిస్టు శిబిరాల మధ్య ఈనాటి కంటే బీభత్స వాతావరణం ఎక్కువగా బిగుసుకొని ఉన్న ఆ రోజుల్లోనే, అణ్వస్త్రాలను వాతావరణ మండలంలో పేల్చడం ఆపివేయాలని 1963లో బ్రిటన్ అమెరికాలతో కృశ్చేవ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సమర్థులైన నేతలు అవలంబించిన పంథాను పూర్తిగా విడిచిపెట్టి గోర్బచేవ్ ఒక్కడే మొదటిసారి సమాజంలో న్యూనాధిక్యతల్ని రద్దు చేస్తూ కమ్యూనిస్టు విధానం స్థాపించిన ప్రజలందరి ఆస్తి' అనే వ్యవస్థను నిర్మూలించి సొంత ఆస్తి వ్యవస్థను మళ్ళీ తీసుకువచ్చాడు. వర్కర్లందరి ఆస్తి అయిన ఫ్యాక్టరీల్ని ప్రైవేటీకరణ చేసి, మార్కెటింగు విధానం తీసుకొచ్చాడు. నిజమైన ప్రజాధిపత్యానికి చిహ్నమైన ప్రొలెటేరియట్ డిక్టేటర్షిప్ అనే శ్రామిక లోక నియంతృత్వాన్ని రద్దుచేసి క్యాపిటలిస్టు వర్గాల చేతుల్లోకి రాజకీయాధికారం వెళ్ళిపోయే అవకాశం కల్పించే బహుళపక్ష రాజకీయాలను ప్రవేశపెట్టాడు. అంటే కమ్యునిజాన్ని పూర్తిగా చితిమీద పెట్టి నిప్పంటించి బూడిద తెచ్చి వోల్గా నదిలో కలిపాడు. ఇది అమెరికా సాధించిన విజయం! కాని సోవియెట్ ప్రజలు సాధించిన విజయంగా క్యాపిటలిస్టు రాజ్యాలు చిత్రిస్తున్నాయి. గోర్బచేవ్, ఎక్స్టెన్, పెవర్డ్ తెడ్డే ఇత్యాది నాయకులు దొంగ ముసుగులు ధరించి తిరుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటో వాళ్ళకే తెలియదు. “కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ డిప్యూటీస్ మాత్రం గోర్బచేవ్ ప్రభృతుల కోరిక ప్రకారం కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఇంటర్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకదాన్ని, దేశీయ విదేశీయ వ్యవహారాల్ని నిర్వహించడానికి సోవియెట్ కౌన్సిల్ అనే రెండవదాన్ని, ఆర్ధిక సంస్కరణల్ని రూపొందించి అమలు జరపడానికి ఇంటర్ రిపబ్లికన్ కమిటీ అని మూడవదాన్ని చట్టరీత్యా ఏర్పాటుచేసి తనకింకా మూడేళ్ళ పర్యంతం ఉన్న ఆయుర్దాయాన్ని అంతం చేసుకుని మరణించింది వెనక చెప్పిన రెండు కౌన్సిళ్ళు ఒక కమిటీ అనే మూడింటిలో మొదట ఉన్న 15 రిపబ్లిక్కుల్లో 10 రిపబ్లిక్కులు మొదటి రెంటిలో స్వతంత్ర దేశాల హెూదాతో సభ్యులయ్యారు. మాల్వియా, జార్జియా ఇంకా సంతకాలు కూడా చెయ్యలేదు. బాల్టిక్ రిపబ్లిక్కులు అనలు రంగంలోనే లేవు. పోతే, ఆర్థిక సంస్కరణలు చూచే మూడవదైన కమిటీలో 12 రిపబ్లిక్కులు చేరాయని అక్టోబర్ 2వ తేదీనాటి వార్త. అందులో కూడా మాల్వియా, అజెర్బైజాన్, ఆర్మీనియా, జార్జియా ఇంకా సంతకాలు చేయలేదట. ఒక అద్వితీయ సైనిక రాజకీయ శక్తి అనిపించుకొన్న సోవియెట్ రష్యా ఇవాళ ఏ రూపమూ లేని వట్టి పొగ. కాంతి శాంతి' అని జపం చేస్తూ ఎంత పని చేశాడు శ్రీ గోర్బచేవ్ మహాశయుడు. గుంటూరు శేషేంద్ర శర్మ ఆంధ్రప్రభ దినపత్రిక 16-10-1991. ------------- సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా గుంటూరు శేషేంద్ర శర్మ Visionary Poet of the Millennium http://seshendrasharma.weebly.com/ జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు తండ్రి సుబ్రహ్మణ్య శర్మ తల్లి అమ్మాయమ్మ భార్య / జానకి పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) కవి : విమర్శకుడు ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………. ..... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు . – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, (21 ఆగస్టు, 2000) * * * పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొకశైలీనిర్మాత. – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999 ----------- అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.” ఆచార్య పేర్వారం జగన్నాథం సంపాదకుడు అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు, (ప్రచురణ 1987) మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ) Visionary Poet of the Millennium seshendrasharma.weebly.com |
Free forum by Nabble | Edit this page |